13 March, 2026 | 9:01 PM

హైదరాబాద్ ప్రపంచ వైద్య రాజధాని

13-03-2026 12:50 AM

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం

బల్క్ డ్రగ్స్ తయారీలో మనమే నంబర్ వన్: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో మెడికవర్ 25వ ఆసుపత్రి.. అత్యాధునిక 640 -స్లైస్ సీటీ స్కాన్ 

అందుబాటులోకి వైద్య రంగంలో సరికొత్త విప్లవం.. ఐదు సెకన్లలోనే గుండె స్కానింగ్

హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 12 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ హెల్త్‌కేర్ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ తయారీలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. భారతదేశంలో మెడికవర్ సంస్థకు ఇది 25వ ఆసుపత్రి కావడం విశేషం.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.., రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రపంచ దేశాలకు ఔషధాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఫార్మా రంగాన్ని తీసుకువెళ్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్ కేవలం ఐటీ రంగంలోనే కాదు, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలోనూ ప్రపంచానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. ప్రపంచానికి అవసరమైన మూడో వంతు టీకాలను మన నగరమే ఉత్పత్తి చేస్తుదని అన్నారు.

ఇప్పుడు బల్క్ డ్రగ్ తయారీలోనూ మనం అగ్రస్థానంలో ఉన్నామని, దీనిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక ఫార్మా విలేజ్‌లు, మెడికల్ డివైజ్ పార్కులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. బల్క్ డ్రగ్స్ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా.. ప్రపంచానికి మనమే మెడికల్ హబ్‌గా మారుతాం అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తంచేశారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల స్థాపన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వైద్య సేవలను ప్రజలకు చేరువచేస్తాం.. 

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రా జనర్సింహ మాట్లాడుతూ.., తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పా రు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు, ప్రైవేట్ రంగంలో వస్తున్న ఇటువంటి అత్యాధునిక ఆసుపత్రులు రాష్ట్ర వైద్య ముఖచిత్రాన్ని మారుస్తాయని, ఇటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఎంతో సహాయపడతాయని మంత్రి తెలిపా రు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో 550 పడకల సా మర్థ్యంతో ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని ఆయన చెప్పారు.

ప్రపంచస్థాయి వైద్యమే మా లక్ష్యం.. 

మెడికవర్ ఆసుపత్రుల ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జీ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.., హైదరాబాద్ ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ డాక్టర్ ఏ శరత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా 640 -స్లైస్ సీటీ స్కాన్, కేవలం 5 సెకన్లలోనే గుండె స్కాన్ పూర్తిచేసే అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ ప్రవేశపెట్టామన్నారు.

దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వేగంగా, ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించగలమని వివరించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీ హరి కృష్ణ మాట్లాడుతూ, హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల అవసరం ఉందని, ఆ అవసరాన్ని గుర్తించి దేశంలోనే అత్యంత ఎత్తున ఆసుపత్రి భవనాలలో ఒకటిగా దీనిని నిర్మించామని తెలిపారు.

డైరెక్టర్ డాక్టర్ ఏఆర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలతో రోగులకు సమగ్ర వైద్య విధానాలను అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు వైద్య ప్రముఖులు పాల్గొన్నారు.