ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి
ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య
కుంభం అనిల్ కుమార్
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఆలేరు, మార్చి 12: ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పై పూర్తి అవగాహన చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గ్రామాలలో, వార్డులలో అందించి జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాల్సిన బాధ్యత సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, చైర్ పర్సన్ లపై ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లు అన్నారు.
గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని వి- కన్వెన్షన్, న్యూ వివేరా లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచులకు, చైర్ పర్సన్ లకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగుతుందని , సర్పంచులు, వార్డు మెంబర్లు, చైర్ పర్సన్ లు గ్రామాలలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి అమలు చేసేలా చూడాలన్నారు. గత రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు ,200 యూనిట్లు ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని గ్రామాలను అందంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టాలన్నారు.
అవసరమైన నీరును ఆలేరు నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపడం జరిగిందన్నారు. రాబోవు కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామాలలో, పట్టణాలలో నీటి ఎద్దటి లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సెర్ప్ సి.ఈ. ఓ, పంచాయతీ రాజ్ కమీషనర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లాలోని అన్ని మండలాల చైర్మన్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.




