25 August, 2026 | 2:07 AM

న్యాయ సేవల హబ్ హైదరాబాద్

25-08-2026 01:14 AM
  1. ఏఐతో న్యాయ సేవలు సులభతరం   
  2. వివిధ దేశాల న్యాయ నిపుణులతో అనుసంధానం    
  3. ‘కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ ప్రారంభోత్సవంలో మంత్రి ఉత్తమ్  

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి) : అంతర్జాతీయ న్యాయ సేవలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బలమైన ఐటీ, సాంకేతిక వ్యవస్థ, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ దేశాలతో మెరుగైన అనుసంధానం హైదరాబాద్‌కు ప్రత్యేక బలాలని మంత్రి చెప్పారు. ‘కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని సోమవారం ఉత్తమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ న్యాయ సేవలకు సంబంధించిన వినూత్న సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం హర్షణీయమన్నారు.  హైదరాబాద్ నగరంలో ఉన్న అనుకూలతలతో ఏఐ ఆధారిత ప్రొఫెషనల్, న్యాయ సేవలకు హైదరాబాద్ ఒక ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని కవేటి లా ఫర్మ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ అటార్నీ డాక్టర్ శ్రీనివాస్ రావు కావేటి.. కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడాన్ని మంత్రి అభినందించారు.

భారత్‌లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రవాస భారతీయులు, పెట్టుబడిదారులు వివిధ దేశాల్లో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అనుసంధానం కావడానికి ఈ కేంద్రం వేదికగా పనిచేయనుందని తెలిపారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్, అంతర్జాతీయ విడాకులు, కార్పొరేట్, క్రిమినల్ లా అంశాలు, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్,

యూఏఈలో కార్మిక పరిహారం, ఉద్యోగ సంబంధిత సమస్యలు, ఒప్పంద వివాదాలకు సంబంధించిన సేవలను సంస్థ అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే ఇటువంటి సంస్థలు తెలంగాణను ఆవిష్కరణలు, విజ్ఞాన ఆధారిత సేవలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.