18 August, 2026 | 4:03 AM

అక్రమ నిర్మాణంలో ఘోర ప్రమాదం..

18-08-2026 12:00 AM

లిఫ్ట్ గుంతలో పడి మేస్త్రి మృతి

జూబ్లీహిల్స్,ఆగస్టు 17(విజయక్రాంతి):నగరంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఓ అక్రమ నిర్మాణం ఒక నిరుపేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ దుర్ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన కృష్ణ (36) జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్నాడు.

మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం యూసుఫ్ గూడ లేబర్ అడ్డ సమీపంలో గల భవనంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ గుంతలో పడి అక్కడిక్కడే మరణించాడు.నిర్మాణదారుడు రాజశేఖర్ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కృష్ణకు భార్య అశ్విని,నాగలాస్య (9),మానస (6) అనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

మృతుడి సోదరుడు లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రభాకర్ వెల్లడించారు.అయితే భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యుడైన బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.అదే విధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.