18 August, 2026 | 3:08 AM

గౌలిదొడ్డిలో సీ అండ్ డీ వ్యర్థాల బదిలీ కేంద్రం ప్రారంభం

18-08-2026 12:00 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోని శేరిలింగంపల్లి జోన్లో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల (సీ అండ్ డీ వేస్ట్) సమర్థవంతమైన నిర్వహణకు మరో ముఖ్యమైన సదుపాయం ఏర్పాటైంది.గౌలిదొడ్డిలో ‘రీ సస్టైనబిలిటీ’ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సీ అండ్ డీ వేస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్ సోమవారం అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ జి. సృజన ఐఏఎస్, అడిషనల్ కమిషనర్ (హెల్త్ అండ్ సానిటేషన్) వేణుగోపాల్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్, సర్కిల్-49 డిప్యూటీ కమిషనర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.నగరంలో పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, తరలించి, ప్రాసెసింగ్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు.

ముఖ్యంగా నర్సింగి, నల్లగండ్ల, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలను వేగంగా అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు చేరవేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల రోడ్లు, డ్రైన్లు, బహిరంగ ప్రదేశాలలో అనధికారికంగా వ్యర్థాలు పడకుండా నిరోధించి, నగర పరిశుభ్రతను మరింత పెంపొందించవచ్చని వారు పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి ప్రాంతాన్ని పరిశుభ్రంగా, హరితంగా, సుస్థిర పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. సీఎంసీ ఇప్పటికే ప్రజా ప్రదేశాల్లో అనధికారిక బ్యానర్లు, పోస్టర్లు లేకుండా చేసే కార్యక్రమాలను కూడా సమాంతరంగా కొనసాగిస్తోంది.పరిశుభ్రమైన, హరిత సైబరాబాద్ నిర్మాణంలో ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్ మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి.