21 May, 2026 | 2:40 AM

శాస్త్రీయ సాగుతో అధిక దిగుబడులు

21-05-2026 01:25 AM

మల్యాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

సిద్దిపేట రూరల్, మే 20: వచ్చే వానాకాలం సాగుకు రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సి.హెచ్. పల్లవి సూచించారు. బుధవారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

డాక్టర్ పల్లవి మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించడం, పంట మార్పిడి విధానం పాటించడం, సాగునీటిని పొదుపుగా వినియోగించడం, సేంద్రీయ సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపారు. శాస్త్రవేత్త సరిత మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన జెజిఎల్-24423, కెఎన్‌ఏం -118, కెఎన్‌ఎం-1638 వరి రకాలు రైతులకు అధిక దిగుబడులు అందిస్తాయన్నారు. మండల వ్యవసాయ అధికారి పరశురాం రెడ్డి మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ మెలకువలను పాటిస్తూ సమగ్ర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిణి మౌనిక, సర్పంచ్ రఘు, గ్రామ రైతులు పాల్గొన్నారు.