పచ్చి రొట్ట ఎరువులతో అధిక లాభాలు
50 శాతం రాయితీపై జనుము, జీలుగ విత్తనాల పంపిణీ
గజ్వేల్, మే20: పచ్చి రొట్ట ఎరువులతో రైతులకు పంట సాగులో అధిక లాభాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే టి. నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డిలు అన్నారు. గజ్వేల్ మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం-2 ద్వారా పచ్చి రొట్ట ఎరువులైన జనుము, జీలుగ విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టి. నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు శ్రేయస్సు, నేల భూసారం పెంపు కోసం పచ్చి రొట్ట విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నదన్నారు. జీలుగ, జనుము వంటి పంటలను పూత దశలోనే నేలలో కలపడం ద్వారా సేంద్రీయ కార్బన్, నత్రజని శాతం పెరిగి నేల నిల్వశక్తి మెరుగు పడుతుందన్నారు.
నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు రసాయన ఎరువుల వినియోగం తగ్గి ఖర్చులు తగ్గుతాయన్నారు. రైతులు వానాకాల ప్రధాన పంటల ముందు పచ్చి రొట్ట పంటలను సాగు చేసి సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఎడిఎ బాబు నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.






