24 April, 2026 | 8:51 PM

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ

24-04-2026 07:29 PM

మాజీ జెడ్పిటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కాలేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బలా మారిందని మాజీ జడ్పిటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ అన్నారు.

శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కాలేశ్వరం అంశాన్ని రాజకీయంగా ఉపయోగిస్తూ,అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకు వస్తారని అన్నారు.