పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పేదల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడంలో సొంత ఇల్లు కీలక పాత్ర పోషిస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఇందిరమ్మ గృహ పథకం కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గృహ యజమానులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సుగుణక్క, వారికి నూతన వస్త్రాలు అందించి ఆశీస్సులు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా వారి సొంతింటి కలను సాకారం చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తిస్తూ గృహ నిర్మాణం వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేదల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అనుమండ్ల స్వప్న రాణి-సాయి, డీసీసీ ఉపాధ్యక్షులు తారీక్ బిన్ అహ్మద్, కట్కర్ భీమ్రావు, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, నాయకులు ఖలీం, సుజాయిత్ ఖాన్, రాము తదితరులు పాల్గొన్నారు.






