బడులపై దాడులు చేస్తే చర్యలు
మల్కాజిగిరి సీపీ సుమతి
ఉప్పల్, జూలై 22 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలలపై దాడులు, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి సీపీ సుమతి హెచ్చరించారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, అక్రమ డబ్బుల డిమాండ్లు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
పాఠశాలల నిర్వహణకు ఆటంకం కలిగించే వ్యక్తులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలపై ఒత్తిడి తీసుకురావడం, విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, సహించబోమని ఆమె హెచ్చరించారు.






