26 February, 2026 | 9:47 PM

హలో బీసీ.. చలో ఇందిరా పార్క్

26-02-2026 12:00 AM

27న ఇందిరా పార్క్‌లో బీసీల నిరాహార దీక్షను విజయవంతం చేయాలి

బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఇక సహించమని, న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఈ మేరకు బుధవారం చిక్కడపల్లిలోని ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీసీల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ దీక్ష కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ ప్రజా ప్రతినిధులు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, అదే విధంగా బిజెపి పార్టీ నుండి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, శాసన సభ్యులు పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంత రావు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, సిపిఐ, సిపిఎం నుంచి ప్రముఖ బీసీ నాయకులు పాల్గొంటారని తెలిపారు.

బీసీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీల న్యాయ దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో  బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, ఎస్. దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ లు ఐయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్,  అంబాల నారాయణ గౌడ్, బైరి శేఖర్, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నగేష్ గౌడ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.