భారీ ఆయుధాలు చోరీ
- 4 ఏకే 47లు, 9 పిస్టళ్లు,
- ఆటోమేటిక్ ఇన్సాస్ వెపన్స్ అపహరణ
- కంటోన్మెంట్ బొల్లారం ఆర్మీ కేంద్రంలో ఘటన
సికింద్రాబాద్/అల్వాల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) పరిధిలోని అత్యంత భద్రత కలిగిన మిలిటరీ ప్రాంతం(military area)లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్(Madras Regiment)కు చెందిన బ్యారక్ తలుపులు బద్దలు కొట్టి భారీగా ఆయుధాలు(weapons), మందుగుండు(ammunition) సామగ్రిని దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 (ఏకే-203) తుపాకులు, రెండు ఆటోమేటిక్ ఇన్సాస్ వెపన్స్,తొమ్మిది పిస్టల్స్, సుమారు 1,200 రౌండ్ల బుల్లెట్లు ఉన్నట్లు అధి కారులు గుర్తించారు.
సాధారణ లేదా బయటి వ్యక్తులకు ఈ ప్రాంతంలోకి ప్రవేశం ఉండే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల పరిశీలనలోనూ కొత్త వ్యక్తులెవరూ ఆ ప్రాంతంలోకి వచ్చినట్లు గుర్తించలేదని సమాచారం. దీంతో డ్యూటీలో ఉన్న 12 మంది ఆర్మీ సెక్యూరిటీ గార్డుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తూ గార్డులను మల్కాజిగిరి కమిషనరేట్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మొత్తాన్ని ఆర్మీ హై అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారుల క్వార్టర్లతోపాటు రాకపోకలపై అధికారులు నిఘా పెట్టారు.






