రెండు రోజులు వడగాల్పులే
- పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
దస్తరాబాద్‌లో 44.5, మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం నిర్మల్ జిల్లా దస్తరా బాద్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో నేడు, రేపు రెండు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల మేర పెరిగే అవకాశముందని తెలిపింది.
శనివారం, ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్త్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది.






