సర్పంచ్ ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు
మోతె, జూలై 11 (విజయక్రాంతి): మోతె మండలంలోని కొన్ని గ్రామాల సర్పంచ్ లకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా చేపట్టిన అమరణ నిరాహార దీక్షను పోలీసులు అనుమతి లేదని పేర్కొంటూ నిలిపివేశారు. ఈ సందర్భంగా సర్వారం గ్రామ సర్పంచ్ మూడ్ నగేష్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసంచేపట్టిన ఈ దీక్షను భగ్నం చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైనట్లు కాదని ఇప్పటికైనా తమ గ్రామాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామ పంచాయతీల పై అధికారుల పెత్తనం లేకుండా, గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులకు తగిన గౌరవం, అధికారులు కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరని పక్షంలో తదుపరి దశలో సర్పంచ్ లతోపాటు గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటారని హెచ్చరించారు.






