24-02-2026 12:07:28 PM
హైదరాబాద్: ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడం(Demolition of houses) హేయమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) మండిపడ్డారు. వినోభానగర్ లో పేదల ఇళ్ల కూల్చివేతను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. వేల మంది పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి.. ఉన్న ఇళ్లనే కూల్చుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వినోభానగర్(Khammam Vinobhanagar)లో అక్రమ కూల్చివేతలను తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు హామీ ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు(Indiramma's house) ఇస్తామని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని మండిపడ్డారు. పేదలపై కర్రలు ఎత్తడం ఆపేసి, ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదల గూడు చెదిరిపోతే.. మీ అధికారం గద్దెలు అంతే వేగంగా కూలుతాయని హరీశ్ రావు హెచ్చరించారు. కూల్చివేతలను వెంటనే ఆపి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదన్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందన్న హరీశ్ రావు ఖమ్మం ప్రజల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.