తెలంగాణకు ఒక్క చుక్క నీరు రావు.. జాతీయ ప్రాజెక్టు రాదు
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని, గోదావరిని పూర్తిగా మళ్లించి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి బనకచర్లను మొదట బయటపెట్టింది, బనకచర్ల అంశంలో ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. గోదావరి-కావేరీ అనుసంధానం అనే మూడో ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, గోదావరిలో సర్ ప్లస్ వాటర్ లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటనే బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందన్నారు. సమ్మక్క సాగర్ నుంచి నాగార్జునసాగర్ నుంచి సోమశిల నుంచి కావేరీ గత ప్రతిపాదన అని, తెలంగాణ భూభాగమే టచ్ కాకుండా ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తుందని తెలిపారు.
పోలవరం నుంచి నల్లమల సాగర్, నల్లమల సాగర్ నుంచి కావేరీ అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదన అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రావు.. జాతీయ ప్రాజెక్టు రాదు అని, కానీ సమ్మక్క సాగర్ 47 టీఎంసీల నీరు వదులుకోవాలంట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.






