19-02-2026 12:00:00 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఐబ్లాక్ 101 సెమినార్ హాల్లో జెనరేటివ్ ఏఐ పై ఒకరోజు హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ నిర్వహించబడింది. ఈ వర్క్‌షాప్‌ను స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ పరిధిలోని ఆడావ్ క్లబ్, ఐఈఈఈ సిఐఎస్ ఎస్ బి సి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్6 సంయుక్తంగా నిర్వహించాయి.
విద్యార్థులకు జెనరేటివ్ ఏఐ సాంకేతికతలు వాటి వాస్తవ జీవిత అనువర్తనాలపై సమగ్ర అవగాహన ప్రాయోగిక అనుభవాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యం జెనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పై బలమైన పునాది అవగాహన కల్పించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలా పాఠ్యం, కోడ్ మరియు సృజనాత్మక కంటెంట్ను సృష్టిస్తాయో వివరించబడింది.
అలాగే అకాడమిక్, పరిశోధన, వృత్తిపరమైన రంగాల్లో సమర్థవంతమైన ఏఐ వినియోగం కోసం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సాంకేతికతల ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవ ప్రసంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి ప్రోగ్రామ్ చైర్ డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి చేశారు. ఆయన తన ప్రసంగంలో జెనరేటివ్ ఏఐ వివిధ పరిశ్రమలపై చూపుతున్న పెరుగుతున్న ప్రభావాన్ని వివరించి, విద్యార్థులు నూతన సాంకేతికతల్లో ప్రాయోగిక నైపుణ్యాలు సంపాదించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. మొత్తం 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.