7 June, 2026 | 4:03 AM

నిమ్స్‌లో ‘హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్’ ప్రారంభం

07-06-2026 12:00 AM

రోగులకు అందుబాటులోకి అత్యాధునిక సేవలు

పంజాగుట్ట, జూన్ 6 (విజయక్రాంతి): నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో సరికొత్త వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఫిజియోథెరపీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి భీరప్ప, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యతో కలిసి ఈ క్లినిక్ను ప్రారంభించారు.

చేతి గాయాలు, నరాల సమస్యలు, కాలిన గాయాలు, శస్త్రచికిత్సల అనంతరం చేతి పనితీరు కోల్పోయిన రోగులకు ఈ క్లినిక్ ద్వారా సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందనున్నాయి. ఈ అత్యాధునిక క్లినిక్ ఏర్పాటుకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి భారీ ఆర్థిక సహకారాన్ని అందించారు. క్లినిక్కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ. 5 లక్షలు కేటాయించారు.

దీనితో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల అంతర్గత రవాణా సౌకర్యార్థం రూ. 28 లక్షల విలువైన రెండు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విరాళంగా ఇచ్చారని హాస్పిటల్ అధికారులు తెలిపారు. మొత్తంగా నిమ్స్ సంస్థకు రూ. 33 లక్షల విలువైన సహాయాన్ని వారు అందజేశారన్నారు.

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భీరప్ప మాట్లాడుతూ.. విరాళం అందించిన పొదెం వీరయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్లు, ఫిజియోథెరపిస్టులు, హ్యాండ్ థెరపిస్టులు ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేస్తూ, రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవనశైలికి చేరుకునేలా ఈ క్లినిక్ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిమ్స్ నిరంతరం ఇలాంటి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోందన్నారు.

ఈ క్లినిక్ రాష్ట్రంలోనే హ్యాండ్ రిహాబిలిటేషన్ సేవలకు ఒక ప్రత్యేక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అదనపు ప్రధాన సంరక్షణ అధికారి సునీత ఎం. భగవత్, నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్.ఓ.డి ప్రొఫెసర్ ఆర్. పార్వతి, సీనియర్ ప్రొఫెసర్ ఆర్. శ్రీకాంత్, ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రవణ్, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.