7 June, 2026 | 2:25 AM

బీటెక్ సీట్ల దందా!

07-06-2026 12:42 AM

సీఎస్‌ఈ కోర్సుకు యమ క్రేజ్

ఒక్కో కాలేజీలో ఒక్కోలా రేటు

రూ.8 లక్షల నుంచి రూ.45 లక్షలు 

ఫీజు, డొనేషన్‌కు వేర్వేరుగా వసూలు

అడ్మిషన్ షెడ్యూల్ రాకముందే సీట్ల విక్రయాలు 

బీ-క్యాటగిరి సీట్లను అమ్మేసుకుంటున్న కాలేజీలు

ఒక్కో సీటుకు 45 లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఓ కార్పొరేట్ కళాశాల!

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు కార్పొరేట్ ఇంజినీరింగ్ కళాశాలలు సీట్ల దందాకు తెరలేపాయి. ఇష్టానుసారంగా సీట్లను బేరసారాలకు పెడుతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులకు పేరున్న కాలేజీల్లో సీటు కొనాలంటే దాదా పు రూ. అర కోటి చెల్లించాల్సిందే. లేకుంటే సీటు దొరకడం కష్టమే. ఇంకా ఎప్‌సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు, బీ క్యాటగిరి (మేనేజ్‌మెంట్ కోటా) నోటిఫికేషన్ రానే లేదు. అప్పుడే కార్పొరేట్ కాలేజీ లు సీట్ల అమ్మకాలు మొదలుపెట్టాయి.

ఫీజు 25 లక్షలు, డొనేషన్‌కు 20 లక్షలు

పలు ఇంజినీరింగ్ కాలేజీలు నిబంధనలు గాలికొదిలేశాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ), అనుబంధ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని అదునుగా చేసుకొని హైదరాబాద్ పరిసరాల్లోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కో సీటుకు ఒక్కో రకంగా ఫీజు డిమాండ్ చేస్తున్నాయి. గ్రేట ర్ హైదరాబాద్‌లోని ఓ పేరున్న కార్పొరేట్ కాలేజీ సీఎస్‌ఈ సీట్లను ఒక్కోటి రూ.45 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.

ఇందు లో రూ.25 లక్షలు ఫీజు కాగా, మరో రూ. 20 లక్షలు డొనేషన్ పేరుతో గుంజుతున్నా రు. ఈ డబ్బున్నంతా వైట్‌లో తీసుకోవడం లేదు. డొనేషన్లకు ఎలాంటి రశీదు ఇవ్వడంలేదు. ఆ డబ్బును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసు కుని సీటు కన్‌ఫామ్ చేసుకోవాల్సి ఉం టుంది. ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్ గురించి, ఇంకేమైనా కాలేజీ వివరాలు అడిగితే ఇష్టముంటే తీసుకోండి, లేకుంటే వెళ్లిపోండనే సమాధానాలు యాజమన్యాల నుంచి వస్తున్నాయి. 

అడిగినంత చెల్లిస్తున్న తల్లిదండ్రులు

ఒక్కో కాలేజీ ఒక్కోలా ఇంజినీరింగ్ సీట్లను విక్రయిస్తున్నాయి. రూ.8 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కౌన్సిలింగ్‌లో మంచి కాలేజీల్లో సీటు వస్తుందో రాదోనని కాలేజీలు ఎం తంటే అంత ఫీజును ఇచ్చి సీట్లను కొనుగో లు చేస్తున్నారు. ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు సీఎస్‌ఈ సీటు కోసమని గ్రేటర్ పరిధిలోని ఓ కాలేజీని సంప్రదిస్తే రూ.25 లక్షలు అడిగినట్లు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని కాలేజీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాస్త పేరున్న కాలేజీల్లో  మేనేజ్‌మెంట్ కోటా సీటుకు రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తుంటే, ఆ తర్వాత స్థాయి కాలేజీల్లో రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.

నిబంధనలివీ..

నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ వచ్చాకనే సీట్లను భర్తీ చేయాలి. అవి కన్వీనర్ కోటా అయి నా? మేనేజ్‌మెంట్ కోటా సీట్లు అయినా? సరే. రాష్ర్టంలో ఎప్‌సెట్ ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి. సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇంకా వెలువడ లేదు. నీట్ పరీక్ష జరిగాకే షెడ్యూ ల్ వచ్చే అవకాశముంది. మరోవైపు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను కాలేజీ లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవి వెలువడక కాకముందే యాజమాన్య కోటా సీట్ల విక్ర యాలు మొదలయ్యాయి. 

ప్రస్తుతం రాష్ట్రం లో 155 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు లక్ష సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులోనూ 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, 30 శాతం బీ-కేటగిరి సీట్లు ఉంటాయి. బీ-కేటగిరీ కోటా కింద ఆయా కాలేజీలే భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఈ సీట్లను నిబంధనల ప్రకారం జేఈఈ మెయిన్,టీజీ ఎప్‌సెట్ ర్యాంకు, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా కేటాయించాలి. 

కాలేజీలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలంటే మూడు భాషల దినపత్రికల్లో తొలుత నోటిఫికేషన్ జారీచేయాలి. దాంతో పాటు నోటిఫికేషన్‌లో బ్రాంచీల వారీగా మేనేజ్‌మెంట్, ఎన్నారై కోటా సీట్ల వివరాలను ప్రకటించాలి. దరఖాస్తు విధానం, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, చివరి గడువు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తులను నేరుగా, ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి స్వీకరించాలి.

దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎక్‌నాలెడ్జ్ మెంట్ పత్రం కూడా కాలేజీలు అందించాలి. అంతేకాకుండా కోర్సుల వారీగా దరఖాస్తు చేసిన మొత్తం విద్యార్థుల జాబితాను కాలేజీ ఆఫీస్ నోటీస్ బోర్డులోనూ అతికించాలి. ఆతర్వాత అభ్యర్థుల మెరిట్ జాబితాను రూపొందించి  సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది తూతూ మంత్రంగానే జరుగుతోంది. 

పట్టించుకునే వారేరీ?

ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా సీట్లను విక్రయిస్తున్నా, తల్లిదండ్రు లు, విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నా దందాకు అధికారులు చెక్ పెడుతలేరు.