7 June, 2026 | 2:22 AM

బొగ్గు నిల్వలు 26.51 లక్షల టన్నులే

07-06-2026 01:16 AM
  1. గతంతో పోల్చితే ఇదే అతి తక్కువ  
  2. పనుల్లో పారదర్శకత కోసమే ‘సైట్  విజిట్’    
  3. ఈ నిబంధన అనేక ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థల్లోనూ ఉంది
  4. మెడికల్ బోర్డులో అక్రమాలపై విచారణ కొనసాగుతోంది   
  5. సింగరేణి యాజమాన్యం వివరణ

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి) : 39 గనులు ఉన్న సింగరేణిలో నిత్యం బొగ్గు ఉత్పత్తి, రవాణా జరుగుతోందని, ఈ నేపథ్యంలో కొంత మొత్తంలో బొగ్గు స్టాక్‌గా ఉండటం సహజం. ఈ ఏడాది కూడా సింగరేణిలో ఈ నెల 4వ తేదీ వరకు 26.51 లక్షల టన్నుల బొగ్గు వివిధ ఏరియాల్లోని గనులు, సీహెచ్‌పీల్లో నిలువ ఉందని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇది గత పదేళ్ల స్టాక్ చరిత్రలో అత్యల్పమని, స్టాక్‌గా ఉన్న బొగ్గును ఎప్పటికప్పుడు రైలు, రోడ్డు మార్గాల ద్వారా వినియోగదారులకు రవాణా చేస్తామని, ఇది బొగ్గు కంపెనీలలో ఒక సహజమైన రవాణా పరిణామంగా పేర్కొంది. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా జరిగే నవంబరు నుంచి మే మాసాల మధ్య బొగ్గు నిల్వలు పేరుకుపోతుంటాయని, ఇలా ఉన్న బొగ్గు నిల్వలను పలు కారణాల వల్ల ఉత్పత్తి తగ్గిన సమయంలో వీటిని థర్మల్ కేంద్రాలకు సరఫరా చేస్తూ రావడం ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ అని తెలిపింది.

2014 నుంచి కూడా ఇదే  విధంగా బొగ్గు నిల్వలు ఉంటున్నాయని, 2015--16లో 70 లక్షల టన్నులు, 2016--17 లో 74 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు రికార్డు అయిందని వెల్లడించింది. 2014 నుంచి 2024 వరకు సగటును 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు గనులు, సీహెచ్‌పీల వద్ద ఉన్నట్టు గుర్తు చేసింది. ముఖ్యంగా వర్షాకాలం కోసం కూడా బొగ్గు నిల్వలు ఉండటం అత్యవసరమని, లేనిపక్షంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గును రవాణా చేయలేని పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది. 

థర్మల్ పవర్ స్టేషన్ల అవసరాలకు 15 రోజులపాటు సరిపడేలా కనీసం 30 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను సిద్ధంగా పెడతామని, తద్వారా వర్షాకాలంలో విద్యుత్ కేంద్రాలకు నిరాటంకంగా బొగ్గు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందని, దేశంలో ప్రతీ బొగ్గు కంపెనీ వద్ద కూడా ఇలాంటి నిల్వలు ఉండటం అత్యంత అవసరమని వివరించింది. 

సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనతో ప్రయోజనాలు

సింగరేణి కాలరీస్‌లో ఓవర్ బర్డెన్ తొలగింపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అతి కీలకమైనది. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే బొగ్గు పొరలపై ఉండే పై మట్టి(ఓవర్ బర్డెన్)ని సకాలంలో తొలగించాలని, ఈ పనులను కాంట్రాక్టర్ల ద్వారా చేపడతామని తెలిపింది. సింగరేణి కాంట్రాక్టులను బహిరంగ టెండర్ల ద్వారానే కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, ఈ నేపథ్యంలో ఎక్కువశాతం ఓవర్ బర్డెన్ టెండర్లలో, కాంట్రాక్టర్లు స్థానిక భౌగోళిక గనుల పరిస్థితులు, సామాజిక రాజకీయ పరిస్థితులు, మౌలిక వసతులు మొదలైన వాటిని సమగ్రంగా అంచనా వేయకుండా టెండర్లలో పాల్గొంటున్నారని స్పష్టం చేసింది.

దీంతొ కొందరు కాంట్రాక్టర్లు ఓవర్ బర్డెన్  పనులను ఆపివేయడం లేదా మందకొడిగా నిర్వహించడం వంటివి చేశారని, దీని ఫలితంగా పనితీరు దెబ్బతిని, సింగరేణికి బొగ్గు ఉత్పత్తిలో నష్టం, కాంట్రాక్టర్లకు ఆర్థిక నష్టం జరుగుతూ, న్యాయ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. శ్రీరాంపూర్ ఓసీ--2  ప్రాజెక్టులో, శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే ఓసీలో సైట్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను మధ్యలో వదిలేయడంతో కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలకు విఘాతం కలిగిందని వెల్లడించింది.

అందుకే టెండర్లలో పాల్గొనే వారు పని ప్రదేశ పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, పనుల పరిధి తదితర అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవడమే సైట్  విజిట్ పెట్టినట్టు వివరించింది. ఇది పోటీని పరిమితం చేయడానికి మాత్రం కాదు.. ఆరోగ్యకరమైన పోటీ, పనుల సమర్థవంతమైన అమలుకు దోహదపడేందుకు తీసుకున్న చర్యగా అభివర్ణించింది.

సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన కేవలం సింగరేణిలోనే కాదు అనేక ప్రభుత్వ సంస్థలలో, ప్రైవేటు సంస్థల్లో కూడా అమలులో ఉందని, సింగరేణిలో మే 2025 నుండి ఓవర్ బర్డెన్ టెండర్లకు సైట్  విజిట్  సర్టిఫికేట్ నిబంధన ప్రవేశపెట్టారని తెలిపింది. ఈ విధానం ఇప్పటికే జీడీఎంసీ (గుజరాత్), జీఐపీసీఎల్, ఎన్‌ఎండీసీ, కొన్ని సౌర విద్యుత్ ప్రాజెక్టులు, ఈపీసీ కాంట్రాక్టుల్లో అమల్లో ఉందని పేర్కొంది.

సమస్య తలెత్తకుండా టెండర్లు

 సింగరేణిలోనే 2018, 2021, 2023 సంవత్సరాల్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు సీఎంపీడీఐ (కోల్ ఇండియా అనుబంధ సంస్థ) సలహా మేరకు సైట్  విజిట్  సర్టిఫికేట్లు తప్పనిసరిగా చేశారు. సైట్  విజిట్ సర్టిఫికెట్ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత మంజూరైన టెండర్లు ఎలాంటి సమస్యలు లేకుండా మంచి పనితీరుతో కొనసాగుతున్నాయని, సదరు కాంట్రాక్టు పనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిరాటంకంగా జరుగుతున్నాయని వెల్లడించింది.

ఇతర సంస్థలలో కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్  విధానం అమల్లో ఉండటం, కాంట్రాక్టర్ల నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, సైట్ విజిట్ కోసం వచ్చే అన్ని కాంట్రాక్టర్లకు సింగరేణి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, సైట్‌ను సందర్శించిన ప్రతి కాంట్రాక్టర్‌కు సైట్  విజిట్  సర్టిఫికెట్లను సింగరేణి జారీ చేస్తోందని వివరించింది. 

కారుణ్య ఉద్యోగాల నియామకాల కోసం మెడికల్ బోర్డు

సింగరేణిలో డిపెండెంట్, కారుణ్య ఉద్యోగాల నియామకాల కోసం మెడికల్ బోర్డును కొనసాగిస్తున్నామని, అయితే ఈ ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, పలువురు దళారులుగా మారి అమాయకులైన కార్మికులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. ఏసీబీ విచారణలో ఇద్దరు ఉద్యోగులు అరెస్టు అయ్యారని, వారిపై శాఖా పరమైన చర్యలు కూడా తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణ కొనసాగుతోందని, మరోవైపు సింగరేణి విజిలెన్స్ విభాగం కూడా ఈ ఆరోపణలపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీని కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.