7 June, 2026 | 2:24 AM

సహార ఎడారిలో 49 మంది దుర్మరణం

07-06-2026 01:05 AM
  1. బక్రీద్ కోసం ట్రక్కులో మాలీ నుంచి నైజర్‌కు..
  2. మధ్యలో మొరాయించిన ట్రక్
  3.   50 డిగ్రీల ఎండ.. నీళ్లు, ఆహారం, ఫోన్ సిగ్నల్ లేక హాహాకారాలు
  4.   50 కి.మీ నడిచి ప్రాణాలు కాపాడుకున్న ఇద్దరు 
  5. మరో ట్రక్కులోని 60 మందిని కాపాడిన సహాయక బృందాలు

మాలీ, జూన్ 6 (విజయక్రాంతి): సహార ఎడారిలో అసలే.. 50 డిగ్రీల ఎండ.. నీళ్లు, ఆహారం, ఫోన్ సిగ్నల్ లేక హాహాకారాలు చేస్తూ.. 49 మంది ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు మాత్రం 50 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో ట్రక్‌లో కొనఊపిరితో విలవిలలాడుతున్న 6ం మంది ప్రాణాలను సహాయకబృందాలు కాపాడాయి.

బక్రీద్ కోసం ట్రక్కులో మాలీ నుంచి ఆఫ్రికాలోని నైజర్‌కు ట్రక్కులో వెళ్లుతుండగా ఈ హృదయవిదారకరమైన, అత్యంత విషాదకర ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా తమ బంధువుల వద్దకు వెళ్లాలని కొందరు మాలీ నుంచి ఆఫ్రికా దేశమైన నైజర్‌కు సహారా ఎడారి లో నుంచి ట్రక్కులో బయలుదేరారు. అస్సామాకా పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో వీరి ట్రక్కు నిలిచిపోయింది.

డ్రైవర్, సహాయకులు కలిసి దాన్ని మరమ్మతు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చుట్టూ ఎడారి ప్రాంతం.. 50 డిగ్రీల ఎండ, నీళ్లు లేక, ఫోన్ సిగ్నల్ అందగా ట్రక్కులోని వారంతా విలవిలలాడారు. వెంటతెచ్చుకున్న నీరు, ఆహారం అయిపోవడంతో దాహానికి, వేడికి తట్టుకోలేక 49 మంది హాహాకారాలు చేశారు. ఇద్దరు మాత్రం ఎలాగోలా సాహసం చేసి 50 కిలోమీటర్లకు పైగా ఆ ఎడారిలో కాలినడకన అస్సామాకా పట్టణానికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక బృందాలతో కలిసి వీరున్న చోటకు బయలుదేరాయి. మధ్యలోనే మరో ట్రక్కు చెడిపోయి కనిపించింది. అందులో 60 మంది వరకు మూడు రోజులుగా చిక్కుపోయి, కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నారు. దీంతో వారికి నీరు, ఆహారం అందించి, వారి ప్రాణాలను కాపాడారు.

తర్వాత మొదటి దగ్గరికి చేరుకోగా అప్పటికే 49 మంది మృతదేహాలు ట్రక్కు కింద చుట్టుపక్కల పడి కనిపించాయి. దీంతో అక్కడే సామూహిక ఖననాలు నిర్వహించారు. ఈ ఏడాదిలో దూర ప్రయాణాలు పెట్టుకోవద్దని చెబుతున్నా, ప్రయాణికులు వినకపోవడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.