రైతు కనకయ్యది ప్రభుత్వ హత్యే
వడ్ల కొనుగోలు జాప్యమే అతని ప్రాణం తీసింది
మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం
మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్, జూన్ 6 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయణ రావుపేటకు చెందిన రైతు కనకయ్యది ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మిల్లర్ల కోతలు, అధికారుల అలసత్వం కారణంగానే రైతు పల్లెవేని కనకయ్య(గద్దర్) గుండెపోటుతో మృతి చెందాడని మండిపడ్డారు.
శనివారం కనకయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డులో దాదాపు 45 రోజుల పాటు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, వర్షాలకు వడ్లు తడిసిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. మిల్లుకు తీసుకెళ్లిన 4 ట్రాక్టర్ల వడ్లలో 40 సంచులు కోత విధించారని, ఆ బాధతోనే కనకయ్య తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడని పేర్కొన్నారు.
ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, రైతు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 80 నుంచి 90 శాతం వడ్లు కొనుగోలు చేశామని చెబుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 30 నుంచి 40 శాతం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతుబీమా అమలులో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నాలుగు నెలలుగా రైతుబీమా చెల్లింపులు నిలిచిపోయాయన్నారు.
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కనకయ్య కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఎలాంటి కోతలు లేకుండా వడ్లను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మేము మళ్ళీ గెలుస్తామని, అడ్డు వచ్చినోళ్లను పండబెట్టి తొక్కుతా అంటూ తొండల భాష మాట్లాడుతున్నావ్, ఎరువుల సరఫరాలో, చనిపోయిన రైతులకు బీమా డబ్బులు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నియోజకవర్గం అల్లదుర్గం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు కనీసం క్వింటాల్ వడ్లు కొనలేదని, కుకునూరుపల్లిలో లారీ లోడ్ రాజస్థాన్ కు తరలించారని, దుబ్బాక మండలం చెరువాపూర్ లో కేంద్రం వద్ద నుంచి సంచులు దొంగలించారని తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వం పని తీరుకు నిదర్శనమని విమర్శించారు.






