ఫారం పాండ్లతో భూగర్భ జలాల పెంపు
వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి:
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, (విజయక్రాంతి): వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేందుకు ఫారం పాండ్లు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లాలో ఫారం పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఫారం పాండ్ నిర్మిస్తున్న రైతు పల్లవితో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. తనకున్న రెండు ఎకరాల భూమిలో రెండు గుంటల విస్తీర్ణంలో ఫారం పాండ్ నిర్మిస్తున్నట్లు రైతు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు, బోర్ల రీచార్జ్, వ్యవసాయ అవసరాలకు ఫారం పాండ్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.
ఫారం పాండ్ల నిర్మాణంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి మరిన్ని పాండ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఫారం పాండ్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి వేరుశెనగ, పెసర, కంది వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరతను అధిగమించడంతో పాటు రైతుల ఆదాయాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
పాఠశాలలో వంటగది పరిశీలన
అనంతరం గోప్లాపూర్‌లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాల వంటగదిని పరిశీలించి విద్యార్థులకు భోజనం గ్యాస్ స్టవ్‌పై వండుతున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ యాదయ్య, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






