20 August, 2026 | 2:45 PM

రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా యువత, ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి

20-08-2026 02:03 PM

18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు పొందాలి

స్వయంగా ఫారం–6 నింపిన ఎమ్మెల్యే బొజ్జు

రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ S.I.R. ప్రక్రియలో యువత భాగస్వామ్యం కావాలి

డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన S.I.R. ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ఒక యువకుడికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్వయంగా ఫారం–6 దరఖాస్తును నింపి, ఓటు హక్కు నమోదుకు శ్రీకారం చుట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన యువతకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఫారం–6 దరఖాస్తు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూనే.. నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ.. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.