20 August, 2026 | 2:02 PM

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

20-08-2026 12:51 PM

రామచంద్రపురం ఆగస్టు 20: రామచంద్రాపురం డివిజన్‌ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్‌ కాలనీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్‌ బూరుగడ్డ పుష్ప నగేష్‌ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

అనంతరం బూరుగడ్డ పుష్ప నగేష్‌ మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి నడిపించిన ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్‌ గాంధీ అని అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువశక్తికి భాగస్వామ్యం కల్పించారని, పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. భారతరత్న రాజీవ్‌ గాంధీ ఆశయాలు, ఆశీస్సుల స్ఫూర్తితో ప్రజా సేవలో, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంలో ఎల్లప్పుడూ ముందడుగు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీష్ గౌడ్,మవిన్ గౌడ్,నాగేష్, పీటర్,శాంతమ్మ,నగేష్,శివ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.