27 February, 2026 | 2:15 AM

జూన్ 2న ఎయిర్ పోర్టుకు భూమి పూజ

25-02-2026 12:00 AM

ఏర్పాటుకు చకచకా అడుగులు

రాజర్షి షా నేతృత్వంలో సమీక్ష

సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎంపీ, ఎమ్మెల్యే సూచనలు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు ఏర్పాటు ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల అని, ఆ కలను సహకారం చేసేందుకు జిల్లా అధికార యంత్రం మరింత కష్టపడి పని చేయాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.

ఎయిర్ పోర్టు ఏర్పాటు పై కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... జూన్ 2న పీఎం నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి లతో పెద్ద పండగ వాతావరణంలో భూమి పూజ చేసేందుకు యోచిస్తు న్నామని, ఆ దిశగా అధికారులు పెండింగ్ పనులన్నీ ఆలోపు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విమానాశ్రయ పనుల్లో నెలకొన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల విషయంలో తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమ య్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు.  విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండిం గ్లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉందన్నారు. 

పారదర్శకత పాటించాలి

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకర ణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా రన్ వే విస్తరణకు సంబంధించి రహదారుల మళ్లిం పు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి అంశాలపై ఆర్‌అండ్బీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భూసేకరణలో భాగంగా ప్రభావితమయ్యే వ్యవసాయ భూములకు సంబంధించి పూర్తి స్థాయి అంచనాలతో కూడిన నివేదికలను తక్షణమే సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ప్రతి అడుగులోనూ పారదర్శకత పాటించాలని అధికారులను కోరారు. సమీక్షా సమావే శంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి,  వివిధ శాఖల ఉన్నతాధి కారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.