వైభవంగా నరసింహుడి ఊరేగింపు
20-03-2026 12:53 AM
మంగపేట, మార్చి 19 ( విజయక్రాంతి ) : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఊరేగింపు భక్త జన సందోహం నడుమ గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించి హేమాచల ఆలయం నుండి మల్లూరు గ్రామంలోని విశ్రాంత మండపం వద్దకు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు.




