5 July, 2026 | 1:11 PM

జనగామలో కేటీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు

05-07-2026 12:35 PM

జనగామ,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌజ్ మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్‌ను కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.

ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా పోలీసులను పెట్టింది. హైదరాబాద్-వరంగల్ హైవే మీద పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల వాహనాలను అడ్డుకుంటున్నారు. మరోవైపు కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.