సాదా బైనామా కష్టాలకు చెల్లు
ఉగాది సాక్షిగా అన్నదాతకు అభయహస్తం..
- రైతును రాజుగా నిలబెట్టడమే ప్రభుత్వ సంకల్పం
- రూ. 20,616 కోట్ల రుణమాఫీతో రైతుల్లో పెరిగిన ఆత్మగౌరవం
- వ్యవసాయమే రాష్ట్రానికి వెన్నెముక
- 22న రైతు భరోసా నిధుల విడుదల : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది పండుగ పర్వదినాన భరోసా ఇచ్చారు. ఏళ్ల తరబడి రైతాంగాన్ని వేధిస్తున్న సాదా బైనామా భూముల సమస్యకు అత్యంత త్వరలోనే శాశ్వత విముక్తి కల్పిస్తామని ఆయన ప్రకటించారు. గురు వారం రవీంద్రభారతి వేదికగా భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రైతును రాజుగా చూడాలన్నదే తమ ప్రభుత్వ ఏకైక సంకల్పమని, వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి తీవ్రస్థా యిలో ధ్వజమెత్తారు. ‘ధరణి రూపంలో రై తులను వేధిస్తున్న ఆ భూతాన్ని తరిమేసి, భూభా రతి ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.
ముఖ్యంగా సాదా బైనామా భూముల కు సంబంధించి రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించాం. అతి త్వరలోనే వీటికి చట్టబద్ధమైన పరిష్కా రం చూపి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పి స్తాం’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
22న రైతు భరోసా..
అన్నదాతలకు పెట్టుబడి సాయం విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూ స్తామని, ఈనెల 22వ తేదీనే రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను పంపిణీ చేయనున్న ట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 18 వేల కోట్లను రైతు భరోసా కింద అందించిందని, ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున సాయం అందుతుందని వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల మేర రుణమాఫీ చేశామని, ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలోనే అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణ మని, ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
వైభవంగా పంచాంగ శ్రవణం..
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ పరాభవనామ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ.. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాలనలో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు.
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి వచ్చిన అర్చకులను ముఖ్యమంత్రి దుశ్శాలువాలతో సత్కరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




