24 August, 2026 | 5:28 AM

వైభవంగా పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

24-08-2026 01:02 AM

తలకొండపల్లి, అగస్టు 23(విజయక్రాంతి): తలకొండపల్లి మండలంలోని  ఖానాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వెళ్లి విరుస్తున్నాయి. గ్రామానికి చెందిన దాత రమేష్ సొంత నిధులతో ఎంతో సుందరంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయ శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో కొనసాగుతుంది.వేడుకలకు ముఖ్య అతిథిగా  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.

లోకకల్యాణం కోసం దేవాలయాలను నిర్మించి ప్రతిష్ఠాపనలు చేయడం పూర్వజన్మ సుకృతమని, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తిభావనను పెంపొందిస్తాయని అన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠతో పాటు ఖానాపూర్ గ్రామంలో ఆంజనేయస్వామి, గణపతి దేవాలయాల నిర్మాణానికి కూడా తనవంతు పూర్తి సహాకారం అందిస్తానని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రకటించారు. వేద పండితులు శ్యాంసుందర్ శర్మ, వెంకటేశ్వర శర్మ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా హోమాలు, యంత్ర పూజలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు నిర్వహించారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన తెలంగాణ టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, టీ పీసీసీ నేత  బాలాజీ సింగ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి సహా పలువురు ప్రముఖులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు.మహోత్సవంలో స్థానిక సర్పంచ్ అనితా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, కాసు శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.