గిడ్డంగుల్లోనే ధాన్యం నిల్వలు
మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి
నంగునూరు, మే 28: రైతులు పండించిన వరి ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు రైస్ మిల్లులపైనే ఆధారం కాకుండా, స్థానిక గిడ్డంగులను సైతం పూర్తి స్థాయిలో వినియో గించుకోవచ్చని నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి స్పష్టం చేశారు.
గురువారం ఆయన సిద్దన్నపేట మార్కెట్ యార్డులోని ధాన్యాగారంలో వడ్ల నిల్వ ప్రక్రియను ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ.. ఈసారి నంగునూరు మండలంలో వడ్ల దిగుబడి గణ నీయంగా పెరిగిందని పేర్కొన్నారు.దీనివల్ల స్థానిక రైస్ మిల్లులన్నీ ఇప్పటికే ధాన్యంతో నిండిపోయాయని, రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు.
మంత్రి ఆదేశాల మేరకు సిద్దన్నపేట మార్కెట్ యార్డ్లో ’పాక్స్’ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఇక్కడి గిడ్డంగిలో నిల్వ చేస్తోందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని, అవసరమైతే నంగునూరు, పాలమాకుల, గట్లమల్యాల గ్రామాల్లోని గిడ్డంగులను కూడా వినియోగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఆడెపు లావణ్య, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖరరెడ్డి, పాక్స్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






