6 May, 2026 | 1:30 AM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

06-05-2026 12:07 AM

జగిత్యాల, మే 5 (విజయక్రాంతి) : జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి  సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏడాది రబీ సీజన్లలో జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు వచ్చాయని అన్నారు.

రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొన్ని షరతుల వలన కొనుగోలు జాప్యం జరిగిందని మంత్రి అన్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులు సమన్వయం చేసుకొని కొనుగోలులో, ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం తర్వాత రైతులను మిల్లర్ల వద్దకు వెళ్లి మాట్లాడమని చెప్పవద్దని అలాంటి పరిస్థితిని తీసుకురావద్దని అధికారులకు సూచించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల  నేపథ్యంలో హమాలీల కొరత వల్ల మిల్లుల్లో ధాన్యం అన్ లోడ్ చేయడం ఇబ్బందిగా మారిందని మంత్రి తెలిపారు. హమాలీల కొరతను అధిగమించి ఎప్పటికప్పుడు ధాన్యం అన్ లోడ్ అయ్యే విధంగా మిల్లర్లు అదనంగా హమాలీ లను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే తూకం వేయాలని, రైతుల వద్ద అదనపు తుకం వేయడానికి అనుమతిచ్చే అవకాశం లేదని తెలిపారు.రైతుల వల్ల రైస్ మిల్లర్లకు ఎలాంటి నష్టం వచ్చిన ప్రభుత్వం తరఫున సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఖరీఫ్ ధాన్యం విషయంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లాకు లక్ష 80 మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ ను తీసుకునే విధంగా తాను చొరవ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా  మిల్లర్లకు గుర్తు చేశారు.

ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన సమస్యల సైతం పరిష్కరించి తూకం వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని,ధాన్యం కొనుగోలు లో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే పోలీసులు చొరవ తీసుకొని రైతులు రోడ్లమీదకి రాకుండా సమస్య పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలని అన్నారు.

సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీతో పాటు జిల్లాలోని చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులు, ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.