22 April, 2026 | 4:25 AM

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి

22-04-2026 01:28 AM

కలెక్టర్ అంకిత్

బూర్గంపాడు,ఏప్రిల్ 21,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలలో భాగంగా మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

పాఠశాలలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల కిచెన్ షెడ్ను పరిశీలించి, మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

బూర్గంపాడు వ్యవసాయ కమిటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీ గా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి, మాయిశ్చర్ మీటర్ ద్వారా తేమ శాతాన్ని తనిఖీ చేశారు.  ప్రతి రైతు వద్ద ఉన్న చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, ఎవరూ నష్టపోకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఠాగూర్ తహసీల్దార్ ప్రసాద్,ఏవో శంకర్, ఎంపీడీవో జమలారెడ్డి,ఏఈవో పవన్ కుమార్,పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.