ఉత్తమ ‘బినామీ ఉద్యోగి’
- పంద్రాగస్టున ప్రశంసా పత్రం!?
- మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి
మహబూబాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో బినామీ ఉద్యోగికి అధికారికంగా ప్రశంసా పత్రం అందజేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో చైన్ ఊమెన్ గా విధులు నిర్వహిస్తున్న కౌసల్య అనారోగ్యానికి గురైంది. ఆమెకు బదులు ఆమె కుమారుడు నాగరాజు కొంతకాలంగా ఆమె విధులను నిర్వహిస్తున్నారు.
అనారోగ్యం పాడిన పడ్డ కౌసల్య పరిస్థితిని గమనించిన అధికారులు ఆమె ఆరోగ్యం కుదుటపడేంత వరకు కౌసల్య చేయాల్సిన పనులను ఆమె కొడుకు నాగరాజుతో నెట్టుకొస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా ప్రశంసా పత్రాలను అందజేశారు. అందులో నాగరాజు పేరు చైన్ మెన్‌గా పేర్కొంటూ ఏకంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ ఇతర జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ చేతుల మీదుగా అందజేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే ఆయన సేవలను గుర్తించి అందజేయాల్సిన ప్రశంసా పత్రం ఇలా బినామీ ఉద్యోగికి ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బినామీ ఉద్యోగిని ప్రశంసా పత్రానికి ఎలా సిఫారసు చేశారనే విషయంపై గూడూరు తహసిల్దార్ ను ఫోన్ ద్వారా వివరణ కోరడానికి ప్రయత్నించగా స్పందించలేదు.






