ప్రజారోగ్య సేవలు మరింత మెరుగుపర్చాలి
అధికారులతో గవర్నర్ సమీక్ష సమావేశం
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేసి ఆకాంక్షిత జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కె. హరిత శాఖల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్పీ నితికా పంత్ జిల్లాలో శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై వివరించారు.






