29 May, 2026 | 10:26 PM

వరి కొయ్యలను కాల్చవద్దు.. భూమిలో కలియదున్నాలని రైతులకు సూచన

29-05-2026 04:15 PM

తంగనపల్లి,మే29(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతులకు వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో నేలలోని తేమ తగ్గిపోవడం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు, మిత్ర పురుగులు నశిస్తాయని వివరించారు. అలాగే మట్టిలోని నత్రజని, భాస్వరం వంటి పోషకాలు కూడా వృథా అవుతాయని పేర్కొన్నారు.

పొలాల్లో మంటలు పెట్టడం వల్ల గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రైతులు వరి అవశేషాలను కాల్చకుండా సహజంగా కుళ్లబెట్టడం లేదా భూమిలో కలియదున్నడం చేయాలని సూచించారు. ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడితే రెండు వారాల్లో అవశేషాలు కుళ్లిపోయి భూమికి పోషకాలుగా మారుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. సంజీవ్, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణ్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.