పంటలను కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వాలు
- కొనుగోళ్లపై సీఎం వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి రామన్న
- త్వరలో జిల్లాలో కేటీఆర్, హరీష్ రావు పర్యటన
ఆదిలాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారిని ఆత్మహత్యల వైపు ప్రోత్సహించేలా పాలనను సాగిస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతులు పండించిన పంట ను కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. త్వరలో జిల్లా పర్యటించనున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు.
శుక్రవారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోళు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ధాన్యం కొనుగోళులో కేంద్రం ఎంత చెబితే అంతే కొనుగోళు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి పదివేల కోట్లు ఇస్తే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారం లేనప్పుడు ఓ మాట అధికారంలోకి వచ్చినక మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో కొనుగోళు చేశామని గుర్తు చేశారు. రైతాంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రైతు సమస్యలను పక్కన పెట్టి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎయిర్ పోర్టు, ఇండస్ట్రియల్ పార్కు పేరు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టిస్తు, కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ యాసం నర్సింగ్ రావు, మాజీ ఎంపీపీ గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్, కుమ్రా రాజు, సతీష్, సూర్యకాంత్, అనిల్, అశోక్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.






