23 May, 2026 | 2:57 AM

ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

23-05-2026 01:34 AM

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్) మే 22 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని, జూన్ 2 నుంచి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు, నూతన పెన్షన్లను మంజూరు చేస్తామని, అలాగే ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయబోతున్నమని రాష్ట్ర పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా స్థాయి సమావేశాన్ని లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక’ ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని తెలిపారు. 2026 మార్చి 6 నుండి జూన్ 12 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలు పూర్తి చేసుకొని నేడు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, జిల్లా స్థాయి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. 

మే 18 నుండి 23 వరకు జరుగుతున్న ‘యువత మరియు క్రీడలు’ వారోత్సవాలు స్ఫూర్తితో యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల  మంజూరు, పథకాల అమలు చేస్తున్న తీరును వివరించారు. ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం,రోజు విడిచి రోజు రాగి జావ, వేడి పాలు అందించనున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తామని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విస్తరిస్తామని, దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పంట వైవిధ్యీకరణ, సహజ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అధికారులు ప్రజలతో సన్నిహితంగా మమేకమైతు పారదర్శకతతో పథకాలను అమలు చేయాలని మంత్రి సూచించారు. లబ్ధిదారుల జాబితాను పథకాల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రామచంద్రపూర్ గ్రామ శివారులోని 10 వేల ఎకరాల పై చిలుకు భూములకు రీ సర్వే నిర్వహించమన్నారు.

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆలయ అభివృద్ధి కోసం 22 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ములుగు నియోజకవర్గానికి అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించామని, ములుగు జిల్లాలో నూతనంగా 38వేల పైచిలుకు పెన్షన్లను జూన్ రెండవ తేదీన అందించనున్నట్లు తెలిపారు.

పథకాల అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు లేవని ధాన్యం తరలించడానికి లారీలు సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ములుగు జిల్లా స్థానిక యువతి యువకులను నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని 80 నుంచి సుమారు 100 ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బహుళ జాతి కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుండే విధంగా కృషి చేయాలని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు గ్రామాల సర్పంచ్ లు గ్రామ అభివృద్ధికి కట్టుబడి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలను, కష్టాలను, కన్నీళ్లను తుడవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడడం కోసం పారిశుధ్య  కార్మికులను సక్రమంగా ఉపయోగించుకో వాలన్నారు. ప్రభుత్వం ఇప్ప చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇప్ప పువ్వు తో అనేక లాభాలు ఉన్నాయన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మే 25వ తేదీ నుంచి మహిళా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి ద్వారా 112 మహిళా సంఘాలకు  2 కోట్ల 25 లక్షల రూపాయలను, బ్యాంకు లింకేజి ద్వారా 175 మహిళ సంఘాలకు 16 కోట్ల 15 లక్షల రూపాయలను, ములుగు మున్సిపాలిటీ మెప్మ 25 సంఘాలకు రెండు కోట్ల 2 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

వివిధ గ్రామాలకు చెందిన 140 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పెగడపెల్లి, కాసిందేవి పేట, రాయినిగూడెం గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు, ఎస్సీ సుధీర్ రామ్నాద్ కేకన్, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వస్సల్ టోప్పో, జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,  మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ రవీందర్ రెడ్డి,ఆర్డీవో వెంకటేష్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.