ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం
జిల్లా స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, మే 22(విజయ క్రాంతి): ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణతో ప్రారంభమైంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజా పాలనప్రగతి ప్రణాళిక ద్వారా వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేలా జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు లకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇటీవల నిర్వహించి న మెగా రైతు మేళా ఎంతో ఉపయోగకరంగా నిలిచిందన్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి చేపట్టాలని, నానో యూరియా వినియోగం పెంచాలని సూచించారు.
రసాయనిక పురుగుమందుల అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతు న్నాయని, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు వైపు రైతులు మళ్లాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణీ లు, చిన్నారుల పోషకాహారంపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారిని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణకు సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రజా పాలనప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను అధికారులు సమావేశంలో వివరించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో హనుమకొండ జిల్లా రాష్ట్రస్థాయిలో రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సివిల్ సప్లైస్, ఐకేపీ, సహకార, రవాణా శాఖల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రైతులు పంటల మార్పిడి వైపు దృష్టి సారించాలని, ఉద్యాన పంటలు, పప్పుదినుసులు, ఆయిల్ పామ్ సాగు ద్వారా మెరుగైన లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదులు తీసు కోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫార్మర్స్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందేందుకు రిజిస్ట్రీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పంట అవశేషాలను పొలాల్లో తగలబెట్టొద్దని, అది పర్యావరణ కాలుష్యంతో పాటు భూసార నష్టానికి దారితీస్తుందని రైతులకు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లా మంచి పురోగతి సాధించిందని, ఇప్పటికే 2 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 2న భారీ స్థాయిలో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా భత్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, రైతులకు స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, దివ్యంగులకు బ్యాటరీ వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ, డీఆర్డీఏ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖతో పాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, డీఆర్డీఓ, విద్యాశాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, యువజన క్రీడాశాఖ, ఉద్యాన శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వివరించారు.
ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రముఖ సంఘసంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.






