క్లీన్ ఎనర్జీ, సుస్థిర మొబిలిటీ మార్పు వేగవంతం
అసోచామ్ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2026లో ప్రభుత్వ భాగస్వాముల చర్చ
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): అసోచామ్ తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2026లో ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, ప్రజా రవాణా, పునరు త్పాదక ఇంధన రంగం, డేటా సెంటర్లు, క్లైమేట్ ఫైనాన్స్, క్లీన్ టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణులు తెలంగాణలో క్లీన్ ఎనర్జీ, సుస్థిర మొబిలిటీ మార్పును వేగవంతం చేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై విస్తృతంగా చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనా లు, క్లీన్ మొబిలిటీ ట్రాన్స్‌మిషన్ అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో టీజీఎస్‌ఆర్టీసీ చైర్మన్ వై. నాగిరెడ్డి మాట్లాడారు.
సంస్థ చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ ప్రణాళికతో పాటు సమగ్ర ఈ-మొబిలిటీ వ్యవస్థ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రస్తుతం టీజీఎస్‌ఆర్టీసీ 1,050కుపైగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోందని, తెలంగాణ వ్యాప్తంగా డిపో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింత విస్తరిస్తోందని తెలిపారు. అలాగే 2028 నాటికి సీయూఆర్‌ఇ (క్యూర్) ప్రాంతంలో 100 శా తం గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యాన్ని సాధించాలనే దృష్టితో ముందుకు వెళుతున్నా మని, డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి చేసే వినూత్న కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు.
టీజీఆర్‌ఈడీసీవో అనిలా వావిళ్ల మాట్లాడుతూ.. ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, ఇంధన మార్పు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్యానెల్ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ రాజ్‌కిరణ్ మాట్లాడుతూ గ్రిడ్ వ్యవస్థలు, ఇంధన నిల్వ సాంకేతికతలు, విశ్వసనీయ విద్యుత్ మౌలిక సదుపాయాల అవసరాల ఆవశ్యకతను చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పలు సంస్థల భాగస్వా ములు మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రీన్ పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు.






