24 April, 2026 | 2:52 AM

ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

24-04-2026 12:00 AM
  1. అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు చేపట్టాలి : మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ
  2. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి : వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి
  3. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి 

వనపర్తి, ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి దిశా కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, కో చైర్మన్ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ వీరితోపాటు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని అన్ని శాఖల వారీగా సమీక్షించిన ఎంపీ, అధికారులు తమ పరిధిలోని పథకాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని విద్యా, వైద్య, రహదారులు భవనాలు, సంక్షేమ శాఖలు, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

 అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు చేపట్టాలి : మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ. 

  కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామ పంచాయతీ భవనం లేకుండా ఉండొద్దని ఆదిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి ఏ ప్రదేశంలో భూమి ఏ పంటకు అనుకూలంగా ఉందో పరీక్షించి ఆ దిశగా రైతులు పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని లబ్ధిని చేకూర్చాలని ఆదేశించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాల లబ్ధిని చేకూర్చాలని సూచించారు. అధికారులు ప్రభుత్వం నుంచి ఏవైనా నిధులు రావాల్సి ఉండి పెండింగ్లో ఉంటే కలెక్టర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తద్వారా తాము ఆ నిధులను విడుదల చేపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

  పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి    

జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న రోడ్ల పనులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశించారు. ఇందుకోసం కావాల్సిన అటవీశాఖ అనుమతులు వేగంగా జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.

జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణం, పెబ్బేర్లో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ ధనలక్ష్మి, ఇత్తర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.