13 August, 2026 | 2:50 AM

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

13-08-2026 01:47 AM

గంగారంలో కలెక్టర్ స్నేహ శబరిష్ విస్తృత తనిఖీలు

మహబూబాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని గంగారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారంలో అమలు చేస్తున్న సమావేశక ఆజీవిక యోజనా పథకం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్ పరిశీలించారు.

రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో  10 రకాల కూరగాయల విత్తనాల (సీడ్స్) కిట్లను 752 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన పంటలు పండించాలని సూచించారు. సీడ్స్ వేసిన విధానం స్వయంగా పరిశీలించి వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలించి వారితో మాట్లాడారు.

డిఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతంగా జరుగుతున్న ’ఫార్మ్ పాంట్’ (రైతు కుంటల) పనులను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో అర్హులైన వివిధ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందుతున్న పింఛన్ల పంపిణీ, తదితర అంశాలను తీరును పరిశీలించి, ఏ ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాలు దూరం కాకూడదని స్పష్టం చేశారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అకస్మాత్తుగా తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, భోజన వసతి, పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు,

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న, తహసిల్దార్ బాలకృష్ణ, ఎంపీడీవో వైష్ణవి, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్, సంబంధిత అధికారులు, రైతులు ఉన్నారు.