28 March, 2026 | 3:15 AM

ఆర్‌ఎస్‌ఎస్ వేడుకకు హాజరు ప్రభుత్వ అధికారిపై వేటు

19-10-2025 12:41 AM

-కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

-సర్వీస్ రూల్స్ ఉల్లంఘించడం వల్లే చర్యలని స్పష్టీకరణ

బెంగళూరు, అక్టోబర్ 18: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగిపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది. రాయ్‌చూర్ జిల్లా సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఈనెల 12న లింగసుగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆ సంఘం యూనిఫాం ధరించి, చేతిలో కర్ర పట్టుకుని హాజరయ్యారు. తోటి కార్యకర్తలతో కలిసి కవాతు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాయి.

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఆ రాష్ట్ర పంచా యతీరాజ్ శాఖ కమిషనర్ అరుంధతి చంద్రశేఖర్ శనివవారం ప్రవీణ్‌కుమార్‌పై సస్పె న్షన్ వేటు వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండాలని, క్రమశిక్షణా నియమాలు పాటించాలని, ప్రవీణ్‌కుమార్ ఆ నియమాలను ఉల్లంఘించడం వల్లే వేటు వేయాల్సివచ్చిందని స్పష్టం చేశారు.

డిపార్ట్‌మెంటల్ విచారణ జరిగే వరకు ఆయనకు జీవనాధార భత్యం మాత్రమే అందుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రవీణ్‌కుమార్ ఒకవైపు ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే, మరోవైపు లింగసుగూర్ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేయడంపై గతంలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాల్లో ఆర్‌ఎస్‌ఎస్ భైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు, ఆ రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.

ప్రజల మనసుల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్ప డుతుందని ఆయన లేఖలో రాసుకొచ్చారు. లేఖ రాసిన కొద్దిరోజులకే అక్కడి ప్రభుత్వం తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ వేడుకలకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగిపై సస్పెన్షన్ విధించడం గమనార్హం. ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడాన్ని మంత్రి ప్రియాంక్ ఖర్గే సమర్థించారు. మరోవైపు ప్రభుత్వ చర్యపై బీజేపీ నేతలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్‌కమార్‌పై ప్రభుత్వం రాజకీయ ప్రేరేపిత చర్య తీసు కున్నదని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు హిందూ ఆధ్యాత్మిక సంస్థలపై కాంగ్రెస్ వైఖరి అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు.