12 April, 2026 | 1:36 AM

ద్విపాత్రాభినయానికి సై

12-04-2026 12:00 AM

‘సైయారా’ అంటూ కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా. తొలిచిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్టుతో బాక్సాఫీస్ ముందుకు వస్తోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ‘వాణి బాత్రా’గా మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హారర్ -కామెడీ జోనర్‌లోకి అడుగుపెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ‘శక్తి శాలిని’ చిత్రంలో అనీత్ ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టే అనీత్ పడ్డా ఇందులో శక్తి, శాలిని అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. బెంగాలీ జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం లో శక్తి ఒక శక్తిమంతమైన రక్షకురాలిగా కనిపిస్తుండగా, శాలిని ఒక భయంకర ఆత్మగా భయపెట్టనుందట.

మోసపోయి, దారుణంగా హత్యకు గురైన ఒక మహిళ ఆత్మగా మారి పురుషులపై ఎలా పగ తీర్చుకుంటుం దనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా కాళీ మాత అంశంతో శక్తి పాత్రను తీర్చిదిద్దారట దర్శకుడు ఆదిత్య సర్పోల్దార్. ప్రస్తుతం ముంబయిలోని మాధ్ ఐలాండ్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విశాల్ జెత్వా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.