సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం
పోలీసుల ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
ములుగు జిల్లా, మంగపేట,(విజయక్రాంతి) : సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానమని మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి, మంగపేట సెకండ్ యస్ఐ శ్రీకాంత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగపేట పోలీసుల ఆధ్వర్యంలో మంగపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి, మంగపేట సెకండ్ యస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుందని, కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి కూడా రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇలాంటి కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు.
డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంటి చూపు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమని,ముఖ్యంగా వాహనదారులు ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారు కచ్చితంగా కళ్లజోళ్లు ఉపయోగించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కోరారు. పోలీస్ శాఖ, ఆరోగ్యశాఖ సూచనలను పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని అరైవ్ – అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ అఖిల, తరుణ్, వైద్య సిబ్బంది, మంగపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .






