ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్ చెరు, జూలై 30: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగియడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్‌ఐఆర్ లో తమ ఓటు వివరాలు నమోదు చేయించుకుని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ లో పాల్గొని పూర్తి వివరాలు అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని ప్రతి ఓటుకు దేశం, రాష్ట్రం, నియోజకవర్గ అభివృద్ధి నిర్ణయించే శక్తి ఉంటుందని తెలిపారు. గురువారం పటాన్ చెరు పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నియోజకవర్గస్థాయి ముస్లింలు, క్రిస్టియన్లు, మిల్లర్స్, సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులకు ఎస్ ఐ ఆర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 40 రోజులుగా ఎస్‌ఐఆర్ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
జూలై 30వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు నియోజకవర్గం వ్యాప్తంగా 63.27 శాతం మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఓటు అత్యంత కీలకమని స్థానికంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మత, కుల సంఘాల పెద్దలు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






