అదనపు తరగతి గదులకు నిధులు విడుదల: కలెక్టర్ బి. సత్య ప్రసాద్
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జీహెచ్‌ఎస్)లో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.ముప్పై ఏడు లక్షలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెట్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత భవనం తొలగించబడిన నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలో కేవలం రెండు తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం నూట అరవై మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ఏడుగురు ఉపాధ్యాయులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోక విద్యార్థులు బోధనాభ్యాసంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రధానోపాధ్యాయులు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. తెలంగాణ విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కరీంనగర్ కార్యనిర్వాహక ఇంజనీర్ సమర్పించిన అంచనా నివేదిక పరిశీలించిన అనంతరం జీఎస్టీ మినహాయించి ముప్పై ఏడు లక్షల వ్యయంతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ పనుల నిర్వహణ కోసం మెప్మా లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి మెట్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాకు విడుదల చేసి, నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్, మెప్మాకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.






