28 August, 2026 | 4:51 AM

దళితుల అభివృద్ధికి 15 శాతం నిధులు విధిగా ఖర్చు చేయాలి: ఎంపీ మల్లు రవి

28-08-2026 12:41 AM

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): దళితుల అభివృద్ధికి కేటాయించిన 15 శాతం నిధులను విధిగా ఖర్చు చేయాలని నాగర్‌ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు. ఖర్చు చేయలేని నిధులు తిరిగి వెళ్లకుండా నిబంధనల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ సమీక్షలో ఎంపీ పాల్గొన్నారు. శాఖల వారీగా మంజూరైన, విడుదలైన, ఖర్చు చేసిన నిధులతో పాటు ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన నిధుల వినియోగంపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ నిధులు కేవలం లెక్కల్లో కాకుండా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలన్నారు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించరాదని స్పష్టం చేశారు. పనులు ప్రారంభం కాని చోట కారణాలను గుర్తించి వెంటనే ప్రారంభించాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను సకాలంలో, నిబంధనల మేరకు వినియోగించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, గురుకుల విద్యాలయాల వసతులపై సమీక్షించారు. వసతి గృహాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, వార్డెన్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మల్లు రవి సూచించారు. విద్యార్థులకు నైతిక విలువలు, బాధ్యతలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి ఉమాపతి, వివిధ శాఖల అధికారులు, సంక్షేమ శాఖల వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.