మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గృహ నిర్బంధం
చిట్యాల, జూన్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో నార్కట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్ష నాయకులను పోలీసుల ద్వారా గృహ నిర్బంధాలకు గురిచేస్తోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడం ద్వారా ప్రజల స్వరాన్ని అణచివేయలేరని, హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని అన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను విరమించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కక్షసాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.






