17-02-2026 01:18:35 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ లో 21 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిసి 23కు చేరిన, బీజేపీ పార్టీ అభ్యర్థిని చైర్మ న్ చేయలేక పోయిన అసమర్థుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని మాజీ మంత్రి జోగు రామన్న ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి అమ్మడుపోయిన పాయల్‌శంకర్, తమపై నిందలు మోపడం సరికాదన్నారు. ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గెలిచిన బీజేపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ మోసం చేశారన్నారు. గెలిచిన బీజేపీ సీట్ల ను తన రాజకీయ గురువుగా చెప్పుకునే రేవంత్‌రెడ్డికి పాయల్ శంకర్ తన వ్యాపారాలను కాపాడుకునేందుకు గురు దక్షిణగా ఇచ్చారని పేర్కొన్నారు.
బీజేపీ క్యాంపులో ఉన్న స్వతంత్ర అభ్యర్థులను కావాలనే వదిలేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ తో ఎమ్మెల్యే లావాదేవీల విషయంలో చీకటి ఒప్పందం చేసుకున్నరన్నారు. కౌన్సిలర్ల దగ్గర డబ్బులు వసూల్ చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు చైర్మన్ చేయలేకపోతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదని, కేవలం స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేశాం అని స్పష్టం చేశారు. మహారాష్ట్రతో బిజెపి ఎంఐ ఎంతో పొత్తు పెట్టుకుందని, అదే మీరు చేస్తే సంసారం... మేము చేస్తే వ్యభిచారమా.. అని ప్రశ్నించారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ పీఠాన్ని ఎమ్మెల్యే అమ్ముకున్నరని ఆరోపించారు.